ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి, న్యాయస్థానాల్లో కేసుల విచారణ వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రయల్‌లో ఉన్న కేసులపై ప్రతి వారం సమగ్ర సమీక్ష జరపాలని కోర్టు మానిటరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం సబ్‌డివిజన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కేసుల విచారణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాక్షుల సమయానికి హాజరు కీలకమని, కేసుల వేగవంత విచారణకు ఇది ప్రధాన అంశమని ఎస్పీ స్పష్టం చేశారు. సాక్షులను సమయానికి కోర్టుకు హాజరుపరచడం ద్వారా విచారణలో ఆలస్యం తగ్గుతుందని తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి కేసును సమర్థంగా పర్యవేక్షించాలని సూచించారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులు శిక్ష నుండి తప్పించుకోకుండా చూడాలని, ప్రతి కేసులో సరైన ఆధారాలను సమర్పించాలని ఎస్పీ సూచించారు. కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు రోజువారీగా కోర్టులో జరిగిన ప్రక్రియను డాక్యుమెంట్ చేసి, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు నివేదించాలని ఆదేశించారు.
ప్రతి సభ్యుడు తన పరిధిలోని కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎస్పీ తెలిపారు. న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల వివరాలను అప్డేట్‌గా ఉంచుతూ, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు. రవిచంద్ర, కోర్టు మానిటరింగ్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు, డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ హబీబ్ బాషా మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.


