ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: నేరాల నియంత్రణకు హైటెక్ నిఘాను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు వ్యాపారులు, ప్రధాన రహదారి దుకాణదారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జి. సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నేరస్తులను అడ్డుకోవాలంటే అత్యాధునిక సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాల్లో మోషన్ క్యాప్చర్ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి సమయంలో కూడా స్పష్టమైన దృశ్యాలు రికార్డ్ అయ్యేలా కెమెరాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.
దుకాణదారులు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలోని నిబంధనలను కచ్చితంగా పాటించాలని, పోలీసుల తనిఖీలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రతి వ్యాపార సంస్థ వద్ద అనుభవజ్ఞులైన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా స్వయంగా ట్రాఫిక్ వార్డర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పోలీసులు, వ్యాపారులు సమన్వయంతో పనిచేస్తేనే నేరరహిత సమాజాన్ని నిర్మించగలమని అధికారులు పేర్కొన్నారు. వ్యాపారుల భద్రతే పోలీసుల ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న వ్యాపారులు పోలీసుల సూచనలను పాటిస్తూ నేరాల నియంత్రణలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, సీఐ జి. సత్యనారాయణ, ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, ఎస్ఐలు సుధాకర్, నాగబాబు, దుర్గాప్రసాద్, రామకృష్ణతో పాటు వ్యాపార సంఘాల ప్రతినిధులు మధుసూధనరావు, సత్యనారాయణ, నాగభూషణం మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


