తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: రంగంపేటలో ఎంపీటీసీ భర్త వెంకట్రావు అదుపులోకి తీసుకున్న ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట అతనిని తమ అదుపులోకి తీసుకోలేదని చెప్పిన పోలీసులు, వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో అనంతరం వెంకట్రావును తామే అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు అతన్ని చూపిస్తామని హామీ ఇచ్చారు. అయితే, అతన్ని ఏ కారణంతో అదుపులోకి తీసుకున్నారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.
వెంకట్రావును పోలీసులు భౌతికంగా హింసించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత సీఐపై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ పట్టపగలే దళిత నాయకుడిని తీసుకెళ్లి తమకు తెలియదని చెప్పడం దారుణమన్నారు. బాధితుడిని హింసించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని హెచ్చరించారు.
మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, పోలీసులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళిత ప్రజా ప్రతినిధి కుటుంబాన్ని వేధించడం అత్యంత బాధాకరమని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై వేధింపులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అనపర్తి ప్రాంతంలో ఇటీవల కిడ్నాప్‌లు, దాడులు పెరిగాయని, రంగంపేట పోలీసుల వ్యవహారం దారుణమని విమర్శించారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించాలని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.



