అమలాపురం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 23: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన వైఖోమ్ నిడియా దేవి గురువారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలులో జాయింట్ కలెక్టర్ కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నిడియా దేవిని జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఘనంగా స్వాగతించారు. వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలతో ఆమెకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి మాట్లాడుతూ, ఈ బాధ్యతలు స్వీకరించడం తనకు గౌరవంగా భావిస్తున్నానన్నారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ ఎ. ఉదయభాస్కర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి. శ్రీనివాస్, ఎల్‌డీఎం కేశవ వర్మ తదితరులు పాల్గొన్నారు.



