తాజా వార్తలు

10/recent/ticker-posts

అంగన్వాడీ నుంచి ప్రాథమిక పాఠశాలకు నూరుశాతం చేరికల దిశగా అడుగు – పిల్లలను స్వయంగా చేర్పించిన కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: అంగన్వాడీ ప్రీ-స్కూల్‌లో విద్యా కార్యక్రమాన్ని పూర్తి చేసిన ప్రతి చిన్నారిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతిలో నూరుశాతం చేర్పించాలనే లక్ష్యంతో జిల్లా పరిపాలన ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఏలూరు మండలం పోణంగి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొన్నారు. చిన్నారులలో చదువుపట్ల ఆసక్తి పెంచేలా, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.


అంగన్వాడీ ప్రీ-స్కూల్‌లో విద్యను విజయవంతంగా పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి, వారిని ప్రాథమిక పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించారు. ప్రత్యేకంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 6 మంది పిల్లలను తన కారులో స్వయంగా తీసుకెళ్లి సమీప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో చేర్పించడం ద్వారా కలెక్టర్ ఆదర్శంగా నిలిచారు. ఈ చర్య గ్రామ ప్రజల్లో, చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపింది.

జిల్లాలో మొత్తం 7,480 మంది చిన్నారులు అంగన్వాడీ ప్రీ-స్కూల్ విద్య పూర్తి చేసుకోగా, ఇప్పటివరకు 4,572 మందిని ప్రాథమిక పాఠశాలల్లో చేర్చినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన 2,908 మంది పిల్లలను కూడా త్వరలోనే చేర్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. పోణంగి అంగన్వాడీ కేంద్రంలో మొత్తం 27 మంది పిల్లలు ఉండగా, అందులో 11 మంది అర్హులలో ఇప్పటికే 5 మంది చేరగా, మిగిలిన 6 మందిని ఈ సందర్భంగా చేర్పించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, నాణ్యమైన బోధన, ఇంగ్లీష్ మీడియం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫారాలు, డిజిటల్ తరగతి గదులు, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రయోజనాలపై తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల హాజరు, పోషణ, అంగన్వాడీ సేవల నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఐసిడిఎస్ పిడి పి. శారద, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ, సర్వ శిక్ష అభియాన్ ఏపిసి డా. కె. పంకజ్ కుమార్, తహశీల్దారు కె. గాయత్రి దేవి, మండల విద్యాశాఖ అధికారి వి. అరుణ్ కుమార్, సిడీపీవో ఏ. పద్మావతి, ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు కూడా కార్యక్రమానికి హాజరై పిల్లల విద్యాభివృద్ధికి మద్దతు తెలిపారు.