తాజా వార్తలు

10/recent/ticker-posts

జంగారెడ్డిగూడెంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారికి విశేష పూజలు – భక్తుల విరాళాలతో ఆలయ అభివృద్ధి వేగవంతం


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: పట్టణ ఇలవేల్పు దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలరించారు. ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవ మూర్తికి పంచామృత అభిషేకాలు, మూలవిరాట్టుకు ఏకాదశ సాయంసంధ్యా హారతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.


ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు నాయకత్వంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణతో పాటు ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాలు అందిస్తున్నారని తెలిపారు. లకణవరపు సత్యనారాయణ – అరుణకుమారి దంపతులు రూ.5,116 విరాళం సమర్పించగా, పెన్మత్స రాజంరాజు – నాగలక్ష్మిదేవి దంపతులు మజ్జిగ పంపిణీకి పెరుగు అందించారు. వెండి చీర తయారీకి ఇమంది వెంకటశివరామకృష్ణ ప్రసాద్ 20 గ్రాముల పాత వెండి పట్టీలు సమర్పించారు.

అమ్మవారి వెండి చీర తయారీకి భక్తులు ధనం, పాత వెండి వస్తువుల రూపంలో విరాళాలు అందించాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. దాతల కుటుంబాలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా మే 1వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి లోకక్షేమార్థం 87వ చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాల్గొనదలచిన భక్తులు ఆలయ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా బృందం, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.