ఆంధ్ర ప్రదేశ్, ఏలూరు, ప్రత్యేక కథనం: దేశ భద్రతా వ్యవస్థలో పోలీసులతో కలిసి పనిచేసే కీలక సహాయక బలంగా హోంగార్డు వ్యవస్థ నిలిచింది. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు తోడ్పడే ఈ వ్యవస్థకు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. 1946 డిసెంబర్ 6న బ్రిటిష్ పాలనలో అప్పటి బొంబాయిలో జరిగిన అల్లర్ల సమయంలో పోలీసులకు సహాయంగా హోంగార్డు వ్యవస్థను ప్రారంభించారు. స్వచ్ఛంద సేవా దృక్పథంతో ప్రారంభమైన ఈ వ్యవస్థ తరువాత దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 1963లో హోంగార్డు వ్యవస్థ అమల్లోకి వచ్చి రాష్ట్ర భద్రతా వ్యవస్థలో భాగమైంది. “హోంగార్డు” అనే పదానికి “గృహ రక్షకుడు” అనే అర్థం ఉంది.
కాలక్రమేణా హోంగార్డులు పోలీసులతో సమానంగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నికల విధులు, పెద్ద సభలు, ఉత్సవాలు, విపత్తుల సమయంలో రక్షణ చర్యలు, అల్లర్ల నియంత్రణ వంటి పలు కార్యక్రమాల్లో వారు ముందుండి సేవలందిస్తున్నారు. పండుగలు, ర్యాలీలు, ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి సందర్భాల్లో పోలీసులకు తోడుగా పనిచేస్తూ సమాజ భద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
అయితే విధుల్లో మాత్రం పోలీసులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ హక్కులు, సదుపాయాల విషయంలో హోంగార్డులు వెనుకబడిన పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం హోంగార్డులకు విధులకు హాజరైన రోజులకు మాత్రమే గౌరవ వేతనం చెల్లించే విధానం అమల్లో ఉంది. రోజుకు సుమారు రూ.700 వరకు డ్యూటీ అలవెన్స్ చెల్లించబడుతోంది. అందువల్ల నెలకు సగటుగా రూ.20 వేల నుండి రూ.24 వేల వరకు మాత్రమే ఆదాయం వస్తోంది.
“నో వర్క్ – నో పే” విధానం అమల్లో ఉండటం వల్ల పని లేని రోజుల్లో ఆదాయం ఉండదు. పల్లెల్లో రోజువారీ కూలీలకు లభించే వేతనంతో పోల్చితే కూడా ఇది తక్కువేనని హోంగార్డుల వర్గాలు చెబుతున్నాయి. ఏలూరు జిల్లాలోనే సుమారు 650 మంది హోంగార్డులు పనిచేస్తున్నట్లు అంచనా. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఈ సేవల్లో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మొత్తం హోంగార్డుల సంఖ్య సుమారు 11,334 మంది కాగా, అనుమతించిన మొత్తం బలం 15,903గా ఉంది.
హోంగార్డు నియామకాల ప్రక్రియలో ప్రస్తుతం కనీస విద్యార్హతలు, శారీరక దృఢత్వ పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన వంటి ప్రక్రియలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా పదో తరగతి ఉత్తీర్ణత, శారీరక సామర్థ్యం, పరుగులు వంటి పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. అయినప్పటికీ వీరికి శాశ్వత ఉద్యోగ హోదా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల నమోదు ప్రక్రియలో హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం వీరు స్వచ్ఛంద సేవా బలంగానే కొనసాగుతున్నారు. గతంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో హోంగార్డులకు ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అవి అమలులోకి రాలేదని మాజీ పోలీసు అధికారులు గుర్తు చేస్తున్నారు.
విధి నిర్వహణలో ప్రమాదాలు ఎదురైనా హోంగార్డులకు సరైన భద్రతా సదుపాయాలు లేవని వర్గాలు పేర్కొంటున్నాయి. విధుల్లో మరణించినా లేదా గాయపడినా ప్రభుత్వ సహాయం పరిమితంగానే ఉందని చెబుతున్నారు. చాలా సందర్భాల్లో సహచర హోంగార్డులే స్వచ్ఛందంగా ఒక రోజు వేతనం సమకూర్చి బాధిత కుటుంబాలకు అందించే పరిస్థితి ఉంది.
అదేవిధంగా వివిధ ప్రాంతాలకు విధుల కోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు టీఏ, డీఏ వంటి ప్రయాణ సదుపాయాలు లేకపోవడం వల్ల స్వంత ఖర్చులతోనే ప్రయాణించాల్సి వస్తోందని హోంగార్డులు చెబుతున్నారు. విధుల్లో రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్య భీమా, జీవిత భీమా, రిటైర్మెంట్ భద్రత వంటి సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యగా నిలిచింది.
రాష్ట్రంలో ప్రభుత్వం పలు వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో హోంగార్డులను కూడా ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగుల తరహాలో గుర్తించి తగిన సదుపాయాలు కల్పించాలని విశ్రాంత పోలీసు అధికారి కరణం ఈశ్వర అభిప్రాయం వ్యక్తం చేశారు. హోంగార్డుల సేవలను గుర్తించి గౌరవ వేతనం పెంచడం, విధుల్లో మరణించిన వారికి ప్రత్యేక పరిహారం, ఆరోగ్య భీమా, జీవిత భీమా సదుపాయాలు కల్పించడం, రిటైర్మెంట్ తర్వాత భద్రత కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
సమాజ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటే వేలాది కుటుంబాలకు భరోసా కల్పించినట్టవుతుంది. పోలీసులతో భుజం తట్టి పనిచేస్తున్న ఈ సేవా బలానికి తగిన గౌరవం, హక్కులు కల్పించాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి.








