ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: జనాభా గణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుబాటులో ఉన్న స్వీయ గణన సదుపాయాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు మండలం పోణంగి గ్రామ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొని, గ్రామ ప్రజలు మరియు రైతుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల్లో సెన్సెస్‌పై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ అవగాహన కల్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన సెన్సెస్ పోర్టల్ ద్వారా కుటుంబ యజమానులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్‌ను ఉపయోగించి సులభంగా స్వీయ గణన పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా ముందుకు రావాలని సూచించారు.
జనాభా గణన దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియగా నిలుస్తుందని, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఇది ఆధారంగా ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ నమోదు వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు ఆగిపోతాయనే భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజలకు సహాయం అందించి, ప్రతి ఇంటి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు.
సెన్సెస్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలు మెరుగ్గా రూపొందించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దారు కె. గాయత్రీ దేవి, గ్రామ సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు స్వీయ గణనపై ఆసక్తి చూపుతూ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.



