టి నరసాపురం: పోలవరం నియోజకవర్గం పరిధిలోని టీ నర్సాపురం మండల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. పోలవరం శాసనసభ్యులు చిర్రీ బాలరాజుకి జీలుగుమిల్లీ మండలం బరింకలపాడు ఆయన స్వగృహంలో వినతి పత్రాన్ని సామాజిక కార్యకర్త నా సర్ పాషా అందజేశారు, తీగలవంచ నర్సాపురం మండల పరిధిలోని ప్రధాన రహదారి మరమ్మతుల ఇతర సమస్యలు పరిష్కరించాలి కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ టి నర్సాపురం నుంచి చింతలపూడి వెళ్ళే ప్రధాన రహదారి వాహనదారుల పాలిట శాపంగా మారిందని అన్నారు. 10 కిలో మీటర్ల ప్రయాణం కారులో ప్రయాణిస్తే గంటన్నర సమయం పడుతుందని తెలిపారు. టీ నర్సాపురం మండల పరిధిలోని ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు అనునిత్యం చింతలపూడి వెళ్ళడానికి ఈ రోడ్డులోనే ప్రయాణించాల్సి ఉంటుందని వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఈ విషయం చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని రోడ్డు అయినప్పటికీ మా గౌరవ శాసనసభ్యులుగా ఈ రోడ్డు మరమ్మతులతో పాటు రోడ్డు వెడల్పుకు కృషి చేయాలని కోరుతున్నామని తెలిపారు. అలాగే టీ నర్సాపురం బంధం చర్ల, టీ నర్సాపురం గండిగూడెం, టీ నర్సాపురం జీలుగుమిల్లి, బండి వారి గూడెం రుద్రకోట రాజుగూడెం, ప్రధాన రహదారులు అధ్వానంగా తయారయ్యాయని, వర్షాల సమయంలో వర్షపు నీరు నిలిచి మరింత బురదమయంగా తయారు అవుతున్నాయని అన్నారు.
ప్రత్యేకించి టీ నర్సాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్లో బంధంచర్ల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద వర్షపు నీరు భారీగా నిలిచిపోయి పంట కాలవను తలపిస్తోందనీ వాపోయారు. టీ నర్సాపురం మండల పరిధిలోని ప్రధాన రహదారులు అంతర్గత రోడ్ల నిర్మాణానికి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు.
1) చింతలపూడి టీ నర్సాపురం బంధం చర్ల, గండిగూడెం, మక్కినవారిగూడెం, జీలుగుమిల్లి, బండి వారిగూడెం, ప్రధాన రోడ్లు వెంటనే మరమ్మతులు చేయాలి, అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి.
2) టీ నర్సాపురంలో ఇంకా మిగిలి ఉన్న డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి, గండిగూడెంలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
3) పర్యావరణ కాలుష్యం తోపాటు ప్రయాణికులకు ఇబ్బందికరంగా తయారైన చింతలపూడి టి నర్సాపురం రహదారిలోని గుర్రాజు గుంట వద్ద చింతలపూడి పంచాయతీ చెత్త డంపింగ్ నిలిపివేయాలి.
4) ఎర్ర చెరువు ప్రాంతం ముంపుకు సంబంధించి గత అనుభవాల దృష్ట్యా అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి సమీక్షించాలి, ముంపు నివారణకు సంబంధించి తగు జాగ్రత్తలతో పాటు అక్కడ నివసిస్తున్న ప్రజల్ని అప్రమత్తం చేయాలి.
5) ధోభీ ఘాట్ కు అనుగుణంగా మండల పరిధిలోని గండి చెరువులో అభివృద్ధి పనులు చేపట్టాలి, కులవృత్తిని ప్రోత్సహించాలి.
6) టి నరసాపురం పరిధిలో విద్యుత్ లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలి, నిరంతర విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టాలి.
7) గిరిజన గ్రామాలలో విష జ్వరాలు ప్రబలకుండా వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించాలి, నిరుపేదలకు ఉచితంగా దోమతెరలు అందజేయాలి.
ఈ విషయాలను వినతి పత్రం ద్వారా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి ఇచ్చినట్లు నా సర్ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడపా నాగరాజు, నవీన్, తేజ, టి నర్సాపురం గ్రామస్తులు మాదంశెట్టి ప్రభాకర్, తాతా రవి, బైగాని రామచందర్ తదితరులు పాల్గొన్నారు.