తాజా వార్తలు

10/recent/ticker-posts

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలి – రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి


చింతలపూడి (ప్రగడవరం), పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను నిర్లక్ష్యంగా వదిలేయడం సరైనది కాదని విమర్శించారు. సోమవారం ప్రగడవరం గ్రామంలో నిర్వహించిన రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని పలు పంటల రైతాంగ సమస్యలను సమీక్షించారు. మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.


ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పథకాన్ని పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ పథకం పూర్తయితే భూగర్భ జల మట్టం పెరిగి ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.

భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. భూ సేకరణ పేరుతో రైతుల భూములను రెవిన్యూ రికార్డుల్లో బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య అవసరాల కోసం భూములను అమ్ముకునే అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయని తెలిపారు. అంతేకాకుండా పంట నష్టపరిహారం, రుణాల వంటి ప్రభుత్వ సౌకర్యాలు కూడా రైతులకు అందడం లేదని చెప్పారు.

రైతుల భూములను వెంటనే బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించాలని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, మండల నాయకులు కనమతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 3, 4, 5 తేదీలలో ఏలూరులో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో రైతాంగ సమస్యలపై సదస్సులు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు అమలు చేయాలని, ముఖ్యంగా వర్జీనియా పొగాకు, అరటి, కోకో, మొక్కజొన్న వంటి పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కొబ్బరి రైతుల సంఘం జిల్లా నాయకులు మున్నంగి సుబ్బారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు ఆర్.వి.ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.