ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో కుక్కునూరు పోలీస్ సిబ్బంది ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామంలో ఇన్స్పెక్టర్ ఎం. రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజా రెడ్డి మరియు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్థులతో కలిసి రాత్రి గడుపుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ మారుతున్న చట్టాల ప్రకారం బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమని తెలిపారు. పేకాట, కోడిపందాలు, నాటుసారా తయారీ మరియు విక్రయాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేస్తే 10 నుంచి 15 నిమిషాల్లో పోలీస్ సహాయం అందుతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘శక్తి’ యాప్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు.
మాదకద్రవ్యాల విక్రయం, వినియోగంపై సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1972 అందుబాటులో ఉందని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను పరస్పరం చర్చించి పరిష్కరించుకోవాలని, అవసరమైతే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమేష్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుక్కునూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది, కివ్వాక గ్రామస్థులు పాల్గొన్నారు.


