ఏలూరు/కైకలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని జనరల్ ఓపీ, రక్త పరీక్ష విభాగం, ఎముకల విభాగం, ఓపీ రిజిస్ట్రేషన్, మహిళల మరియు పురుషుల వార్డులు, బ్లడ్ బ్యాంక్ తదితర విభాగాలను పరిశీలించారు. రోగులు మరియు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై అభిప్రాయాలు తెలుసుకుని, సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తనిఖీ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు నాణ్యమైన వైద్యసేవలు అందించి రోగులలో విశ్వాసం పెంచాలని సూచించారు. నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకుని, సుఖప్రసవాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
అనారోగ్య సమస్యల కారణంగా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ వైద్యసేవలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వైద్యులు పనిచేయాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి కేసును ఇక్కడే చికిత్స చేసి, రోగులను ఆరోగ్యంగా ఇంటికి పంపించాలని చెప్పారు.
వైద్యాధికారులు మరియు సిబ్బంది సమయపాలన పాటిస్తూ స్థానికంగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్, రేడియాలజిస్ట్ మరియు అదనపు వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఆర్డీవో ఐ. కిషోర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. శ్వేత, వైద్యులు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, రోగులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


