ఏలూరు/కైకలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: కైకలూరు తహశీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పాల్గొని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, మత్స్యశాఖ తదితర విభాగాల పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు పక్కా ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజుకు రెండు పూటలుగా పుష్కలంగా త్రాగునీరు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. నీటి వనరులు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలని, లీకేజీలను వెంటనే నివారించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు. ఎక్కడైనా లోపాలు తలెత్తితే ఆయా శాఖల అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మండలాల వారీగా మంజూరైన పనులు, ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు పోటీతత్వంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ప్రతి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. డోర్ టు డోర్ చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలని, అవసరమైన వాహనాలు సమకూర్చాలని చెప్పారు. సంపద సృష్టించే కేంద్రాల నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్య, మహిళా సంక్షేమం, ఉపాధి రంగాలపై కూడా కలెక్టర్ దృష్టి సారించారు. అంగన్వాడి నుంచి ప్రాథమిక పాఠశాలలకు, అక్కడి నుంచి ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల ప్రవేశాలను నిర్ధారించాలని తెలిపారు. ఒక్క విద్యార్థి కూడా చదువు మానివేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల్య వివాహాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహిస్తూ బ్యాంకు రుణాలు, రాయితీలపై అవగాహన కల్పించాలని అన్నారు.
ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల అమలులో జిల్లా యంత్రాంగం కృషిని అభినందించారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడమే అధికారుల ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు. కైకలూరులో త్రాగునీటి సమస్య పరిష్కారానికి రాపిడ్ సాండ్ ఫిల్టర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా, కొన్ని ప్రాంతాల్లో ఉన్న భూసమస్యలను పరిష్కరించాలని, కలిదిండి మండలంలోని కొచ్చర్ల గ్రామానికి వెళ్లే వంతెనకు రహదారి నిర్మాణం చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, ఇన్‌చార్జ్ ఆర్డీవో ఐ. కిషోర్, ఆర్ & బి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, విద్య, మత్స్యశాఖ, ఐసిడిఎస్ తదితర శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.



