ఏలూరు జిల్లా, ఉంగుటూరు, పశ్చిమ వాహిని మార్చి 27: మండలంలోని యర్రమళ్ల గ్రామానికి చెందిన చిన మావుళ్లయ్య(25) స్థానికంగా చేపల ప్యాకింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన ఇర్రి రమ(34)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే రమకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణ పరిచయంతో మొదలైన వీరి స్నేహం, కొద్ది రోజులకే ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మానసికంగా దగ్గరయ్యారు.
రహస్య వివాహం.. కుటుంబంలో రచ్చ..
తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని భావించిన మావుళ్లయ్య, రమ ఇటీవల రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం యర్రమళ్ల గ్రామంలోనే కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న రమ భర్త, ఆమె తల్లిదండ్రులు ఆగ్రహంతో యర్రమళ్లకు చేరుకున్నారు. మావుళ్లయ్య కుటుంబాన్ని తీవ్రంగా నిలదీశారు. తమ కూతురి జీవితాన్ని నాశనం చేశావంటూ మావుళ్లయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రమను బలవంతంగా తమతో పాటు సింగుపురానికి తీసుకెళ్లారు. ఈ పరిణామంతో మావుళ్లయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఆఖరి ఫోన్ కాల్.. ఆపై అఘాయిత్యం..
ఈ నెల 24న రాత్రి మావుళ్లయ్య తన అన్న కుమారుడికి ఫోన్ చేశాడు. "రమ తిరిగి వచ్చేసింది, ఇద్దరం నాచుగుంట కాలువ గట్టు దగ్గర ఉన్నాం, వెంటనే ఇక్కడికి రా" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆందోళనతో అతని అన్న కుమారుడు వెంటనే నాచుగుంట కాలువ వద్దకు చేరుకునేసరికి అక్కడ మావుళ్లయ్య, రమ కనిపించలేదు. వారి చెప్పులు, సెల్‌ఫోన్, ఇతర వస్తువులు మాత్రమే గట్టుపై పడి ఉన్నాయి. దీంతో వారు గోదావరి పశ్చిమ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానించి, వెంటనే చేబ్రోలు పోలీసులకు సమాచారం అందించారు.
ఒక్కొక్కరిగా ఒడ్డుకు చేరిన మృతదేహాలు..
ఫిర్యాదు అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో కలిసి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం ఉంగుటూరు సమీపంలో మావుళ్లయ్య మృతదేహం లభ్యమైంది. అయితే రమ ఆచూకీ లభించలేదు. ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటుందన్న బలమైన అనుమానంతో గురువారం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. వారి గాలింపులో చేబ్రోలు వద్ద కాలువలో రమ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో యర్రమళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లెదుటే పెరిగిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో మావుళ్లయ్య తల్లి గుండెలు పగిలేలా రోదిస్తుండటం స్థానికులను కంటతడి పెట్టించింది. మరోవైపు, ఏ పాపం తెలియని ఇద్దరు పసిపిల్లలు తల్లి ప్రేమకు శాశ్వతంగా దూరమయ్యారు. క్షణికావేశంలో తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం, రెండు కుటుంబాల్లో పూడ్చలేని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


