నూజివీడు, పశ్చిమవాహిని, మార్చి 18: రహదారి ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా నూజివీడు మండలంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు.
నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో మీర్జాపురం రహదారిపై రాత్రి మరియు తెల్లవారుజామున ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు నిద్రమత్తు, అలసట కారణంగా ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు “ఫేస్ వాష్ కార్యక్రమం” నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనదారులకు నిద్ర మత్తులో డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో వివరించి, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్‌కు ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలని, అధిక వేగాన్ని నివారించాలని సూచించారు.
హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని హెచ్చరించారు. రాత్రివేళల్లో లైట్లను సరిగా వినియోగించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తి రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.



.jpeg)








