ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 18: రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, సర్వ మానవాళి సుఖసంతోషాల కోసం చేసే ప్రార్థనలే దీని ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు.
ఏలూరులోని గిరిజన భవన్‌లో మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగర మేయర్ షేక్ నూర్జహాన్‌లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న చిన్నారులు, ముస్లిం మతపెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పీజీ, పీహెచ్‌డీ వరకు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయం, మసీదులు, షాదీఖానాల నిర్మాణం వంటి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనాలు అందిస్తున్నామని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యలో అభివృద్ధి సాధించాలని సూచించారు.
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్ష మనుషుల్లో ఓర్పు, సహనం, సత్ప్రవర్తనను పెంపొందిస్తుందని అన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఈ మాసం ప్రేమ, సోదరభావం, మానవత్వాన్ని పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు.
నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ త్యాగం, ఐక్యత, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. హజ్ హౌస్ నిర్మాణం, స్కాలర్‌షిప్‌లు, మైనారిటీ ఫైనాన్స్ సదుపాయాలు వంటి పథకాలు అమలవుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ముస్లిం మతపెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.



.jpeg)








