ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 30: జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ చేపడుతున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి గాను ఇప్పటివరకు 1,54,386 టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతుల నుంచి సరళంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు.
జిల్లాలో మొత్తం 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 103 కేంద్రాల ద్వారా సేకరణ కొనసాగుతోందన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 58 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచి అవసరాలను తీర్చుతున్నట్లు చెప్పారు.
ఉంగుటూరు మండలంలోనే 53,485 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. నారాయణపురం సహా ఇతర కేంద్రాల ద్వారా కూడా 3,745 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. ఉంగుటూరు మండలంలో 157 వాహనాలు నమోదు చేసి, 16,93,747 గోనె సంచులు రైతులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
అకాల వర్షాల నుండి ధాన్యాన్ని రక్షించేందుకు జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉంగుటూరు మండలంలోనే 325 టార్పాలిన్లు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రైతులు తమ ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేసుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
రైతులు స్వయంగా హమాలీలు, వాహనాలు, గోనె సంచులు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు చెల్లింపులు జరుగుతాయని వెల్లడించారు. గోనె సంచులకు రూ.4.47, హమాలీలకు రూ.24.06 చొప్పున చెల్లింపు అందిస్తామని తెలిపారు. రైతుల సౌకర్యం కోసం పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా వెంటనే పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18004256453 లేదా హెల్ప్ డెస్క్ నెంబర్ 7702003584 కు సంప్రదించాలని సూచించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


