తాజా వార్తలు

10/recent/ticker-posts

జలధార–జలహారతి పనులు వేగవంతం – నాణ్యతపై కలెక్టర్ దృష్టి


ఏలూరు/నూజివీడు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 30: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న “జలధార–జలహారతి” కార్యక్రమాలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. నూజివీడు మండలంలోని పల్లెర్లమోడీ, ఎం.ఎన్.పాలెం, తుక్కులూరు తదితర గ్రామాల్లో చేపట్టిన పనులను గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి పలు సూచనలు చేశారు.


కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటి ప్రతి చుక్కను సంరక్షించడం “జలధార–జలహారతి” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.150 కోట్లు కేటాయించి పనులు చేపట్టగా, నూజివీడు మండలంలోనే 302 పనులకు రూ.12 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు రైతులకు, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగించేలా ఉండాలని సూచించారు. చెరువులు, ఫీడర్ చానళ్ల వంటి నీటి వనరులను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. చెరువుల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, దీని వల్ల భూగర్భ జలాలు కూడా మెరుగుపడతాయని అధికారులు వివరించారు.

శ్రామికులకు ఇబ్బందిగా ఉన్న పనులను యంత్రాల సహాయంతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ కార్మికులు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కీలక సాధనమని పేర్కొన్నారు.

పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని, అధికారుల నిర్లక్ష్యం గమనించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులు ప్రారంభించే ముందు, పూర్తయ్యాక ఫొటోలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ కె. వెంకట సుబ్బారావు, ఇరిగేషన్ శాఖ డీఈ అర్జున్ రావు, ఇతర శాఖల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది, రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.