తాజా వార్తలు

10/recent/ticker-posts

సింహవాహనంపై వైభవంగా నూకాలమ్మ అమ్మవారి గ్రామోత్సవం


జంగారెడ్డిగూడెం, పశ్చిమవాహిని, మార్చి 18: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పట్టణ ఇలవేల్పు దేవత శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి 62వ వార్షిక ఉగాది జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మార్చి 15న ప్రారంభమైన ఈ జాతర ఉత్సవాలు ఈ నెల 22 వరకు జరగనున్నాయి.


జాతర నాల్గవ రోజైన బుధవారం సామూహిక లలిత పారాయణ, భక్తిగీతాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానార్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ ఆధ్వర్యంలో నిత్యపూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు.

మధ్యాహ్నం తాండ్రపాపారాయుడు సెంటర్‌లోని వెలమ రామాలయం నుండి ప్రత్యేకంగా అలంకరించిన సింహవాహన రథంపై నూకాలమ్మ అమ్మవారి గ్రామోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, డప్పులు, బాజాభజంత్రీలు, గరగాటాలు, భజన కోలాటాలు, వివిధ వేషధారణలతో భక్తులు పాల్గొని పట్టణ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. “జై నూకాంబికా” నినాదాలతో పట్టణం మార్మోగింది.

గ్రామోత్సవంలో అడుగడుగునా భక్తులు అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించి హారతులు ఇచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.

ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) మాట్లాడుతూ ఉగాది జాతర ఉత్సవాల్లో భాగంగా గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని, అనంతరం పంచాంగశ్రవణం, శక్తితత్త్వంపై ప్రవచనం జరుగుతాయని చెప్పారు.

ప్రధానార్చకులు శంకర మహేష్ శర్మ మాట్లాడుతూ కొత్త అమావాస్య రోజున చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయని, అమ్మవారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు.

నూకాంబికా మహిళా సేవా భక్త బృందం, యువత, ఆలయ కమిటీ సభ్యుల సమిష్టి కృషితో గ్రామోత్సవం కన్నుల పండుగలా జరిగింది.