ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 30: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో (MSK) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న మహిళా కార్యదర్శులతో సమావేశమై వారి విధులు, సమస్యలు, అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. సమాజంలో వారి పాత్రను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దేలా సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళా సంరక్షణ కార్యదర్శుల పని సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లు, కంప్యూటర్ సంబంధిత పనుల్లో వారి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. బాధితులతో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను ఓర్పుతో వినడం ద్వారా సమస్యల పరిష్కారానికి దోహదం చేయాలని సూచించారు.
పోలీస్ శాఖలో ప్రమోషన్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్తులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ నివారణ, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్లు, సాఫ్ట్ స్కిల్స్ అవసరమైన విభాగాల్లో మహిళా కార్యదర్శుల ప్రతిభను సమర్థంగా వినియోగించుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులందరికి ఉన్న సౌకర్యాలు సచివాలయ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని ఎస్పీ గుర్తుచేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో భద్రతా లోన్లు 5 శాతం వడ్డీకే అందుబాటులో ఉండడం, పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, పోలీస్ క్యాంటీన్ ద్వారా తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు పొందే అవకాశం ఉన్నదని వివరించారు.
జిల్లాలో 493 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల వివరాలను పారదర్శకంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ముందుగా పోలీసులను ఆశ్రయిస్తారని, అలాంటి విభాగంలో పనిచేయడం గౌరవప్రదమని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయడంలో మహిళా కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జీ. మునిరాజా, ఏఓ షేక్ మస్తాన్, సూపరింటెండెంట్లు సువర్చల, పి. నాగేశ్వరరావు, అలాగే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ప్రేరణాత్మకంగా సాగింది.


