ANDHRA PRADESH, TELANGANA, HYDERABAD: ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాలలో భారత్ 151వ స్థానంలో పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల కంటే దిగువ స్థానంలో ఉండటం బాధాకరమని సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్ వాపోయారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలిపారు.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ప్రభుత్వేతర సంస్థ 2002 నుంచి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికను ప్రచురిస్తోందని,1993 నుంచి ప్రతియేటా 03 మే రోజున ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ”ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం" నిర్వహిస్తున్నప్పటికీ, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ స్థితిని మొదటిసారిగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టు సూచిక వర్గీకరించిందని పేర్కొన్నారు.
1991లో పత్రికా స్వేచ్చ, స్వాతంత్య్రం, బహువచన పత్రికారంగం కోసం ”విండ్‌హాక్ డిక్లరేషన్” చేసిన సందర్భానికి గుర్తుగా "వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే" నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత ప్రదర్శన ‘చాలా తీవ్రమైన’ వర్గంలోనే ఉన్నదని నివేదిక వివరించిందని, రాజకీయ దిగ్గజాల చేతుల్లో మీడియా యాజమాన్యం కేంద్రీకృతమై ఉన్న కారణంగా మీడియా బహుళత్వానికి ముప్పు వాటిల్లుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉండటం విచారకరమన్నారు.
2014లో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ మీడియా ‘అనధికారిక అత్యవసర పరిస్థితి’లోకి పడిపోయిందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీ, మీడియాలో ఆధిపత్యం చెలాయించే పెద్ద కుటుంబాల మధ్య అద్భుతమైన సయోధ్యను రూపొందించిందని భారత్‌పై తన విభాగంలో వివరించటం గమనార్హం. ప్రధానికి సన్నిహిత స్నేహితులైన సంపన్న పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ 70కి పైగా మీడియా సంస్థలను కలిగి ఉన్నాడనీ, అదానీ గ్రూపు ఎన్డీటీవీని కొనుగోలు చేయటం ప్రధాన స్రవంతి మీడియాలో బహుళత్వానికి ముగింపుని సూచిస్తుందని మీడియా వాచ్‌డాగ్ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ వివరించింది.
గోడీ మీడియాగా పిలవబడే బీజేపీ అనుకూల ప్రచారాన్ని చేసే మీడియా సంస్థలూ పెరిగాయని పేర్కొంటూ మీడియా విషయంలో ప్రధాని మోడీ తీరునూ వివరించింది. ”ప్రధాని పత్రికా సమావేశాలు నిర్వహించరు. తనకు అనుకూలంగా ఉండే జర్నలిస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారు. విధేయత చూపని వారిని తీవ్రంగా విమర్శిస్తారు” అని నివేదిక పేర్కొన్నది. ఇక మోడీ సర్కారును విమర్శించే భారతీయ జర్నలిస్టులు బీజేపీ అనుకూల వర్గాల ట్రోల్స్ ద్వారా వేధింపులను ఎదుర్కొన్నారని కూడా నివేదిక వివరించటం గమనార్హం.
ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా స్వేచ్ఛా పత్రికా వ్యవస్థ లేదని, వార్తా మాధ్యమాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాణ్యమైన నివేదికలను ఫణంగా పెట్టి ప్రేక్షకులను ఆకర్షించే పోటీలోకి దిగుతాయనీ, వారిని దోపిడీ చేయటానికి ప్రయత్నించే సామ్రాజ్యవాదులు, ప్రభుత్వ అధికారులకు బలైపోవచ్చని చెప్పారు.
డిజిటల్ యుగంలో రిపోర్టింగ్ :
పత్రికా స్వేచ్ఛపై ఏఐ ప్రభావం” అనే అంశం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం-2025 ఇతివృత్తమని తెలిపారు. ఏఐతో తప్పుడు సమాచారాలు, సమాచారం అందకపోవడం, డీప్‌ఫేక్ టెక్నాలజీ తిప్పలు లాంటివి కూడా ఉన్నాయి. పక్షపాత సమాచారం, జర్నలిస్టులపై నిఘా పెరగడం, పని సమానమైన వేతనాలు అందకపోవడం, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా స్వార్థపర రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లడం, పత్రికా రంగ విలువలు పలుచబడడం ఈ దశాబ్దకాలంగా పెరిగింది.
ఎల్లో జర్నలిజం పురుడు పోసుకోవడం, జర్నలిస్టులపై హత్యాప్రయత్నాలు జరగడం, విలేకరుల కలం నోళ్లు నొక్కడం, జర్నలిజంలో రాజకీయాలు ప్రవేశించడం లాంటి అవలక్షణాలు కూడా ఈ కాలంలో బాగా పెరిగాయి. గుత్త పెట్టుబడిదారులు సైతం మీడియాలోకి ప్రవేశించడం అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఇలాంటి ధోరణలు, సమస్యల మధ్య పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడమంటే కత్తిమీద సామే. నిజాయితీ కలిగిన జర్నలిస్టులపై జరిగే దాడులను ఖండించడం, అక్రమార్కుల భరతం పట్టడం, పారదర్శకత పాటించడం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం జరగాలి.
ప్రపంచ స్థాయి ఐక్యత సాధించడం, వివిధ మీడియా గ్రూపులను ఐక్యంగా కలుపుకోవడం, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించే అంతర్జాతీయ వేదికలను ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం లాంటి అంశాలను చర్చించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరమని చెప్పారు.
రాజకీయ, చట్టపరమైన, ఆర్థిక, సామాజిక అంశాలు పత్రికాస్వేచ్ఛను ప్రభావితం చేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడితే అన్యాయమే రాజ్యమేలుతుంది, పేదరికం వెక్కిరిస్తుంది. సమన్యాయం, అభివృద్ధి, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఆందోళనకరంగా మారుతుంది. అందుకే పత్రికాస్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రజలకు అనేక విషయాల్లో అవగాహనతో పాటు న్యాయం జరిగే విధంగా ఉంటుంది. నేటి పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, మీడియా మిత్రుల భద్రత లాంటివి రేపటి సమసమాజ స్థాపనకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలే కానీ, గొంతునొక్కేలా వ్యవహరించకూడదని, అలా నిజాల్ని మరుగున పరిచే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తు తరం పాలకవర్గాలను క్షమించదని వి. కృష్ణ మోహన్ హెచ్చరించారు.
వి. కృష్ణ మోహన్
జాతీయ చైర్మన్,
కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ (సీసీజీజీఓఓ)
(M) 9182189533 హైదరాబాద్
కార్యదర్శి, ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) kmdrdo@gmail.com