ANDRAPRADESH, VIJAYAWADA: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. విజయవాడలో సరికొత్త ఆలోచనను అమలు చేస్తోంది. ఉపాధి, ఉద్యోగం, ఇతర పనులపై విజయవాడకు వచ్చి ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రభుత్వం మంచి సదుపాయం కల్పిస్తోంది. ఆశ్రయం లేని నిరుద్యోగుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ 4 చోట్ల వసతి గృహాలు (హాస్టల్స్ లాంటివి) ఏర్పాటు చేసింది.
కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు, రూపాయి ఖర్చు లేకుండా అక్కడ ఆశ్రయం పొందొచ్చు. అక్కడ భోజనం, టీవీ, యోగా లాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విషయం కొందరికే ఈ తెలుసు అంటున్నారు. సరైన ప్రచారం లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు లాడ్జీల్లో డబ్బులు ఖర్చు చేసి మరీ ఉంటున్నారు.
ఏపీ ప్రభుత్వం జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద ఈ వసతి గృహాలను ఏర్పాటు చేశారు. విజయవాడలోని విద్యాధరపురం, రాణిగారితోట, గాంధీనగర్, వెహికల్ డిపో ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఒక్కో వసతి గృహంలో వంద పడకలు అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడికి వచ్చిన వారు ఒక్క ఆధార్ కార్డు చూపిస్తే చాలు రూపాయి కూడా తీసుకోకుండానే అక్కడ ఆశ్రయం పొందొచ్చు అని అధికారులు తెలిపారు. అలాగని రోజుల తరబడి అక్కడే ఉంటామంటే కుదరదండోయ్.. ఉపాధి, ఏదైనా ఉద్యోగ దొరికే వరకు మాతమ్రే అక్కడ ఉండొచ్చు.
ఈ వసతి గృహాల్లో పడుకోవడానికి మంచం, దుప్పట్లు అందజేస్తారు. అక్కడ మరుగుదొడ్లు, స్నానాల గదులు కూడా ఉంటాయి. ఉదయం టిఫిన్, రాత్రి భోజనం కూడా అందిస్తారు. అంతేకాదండోయ్ అక్కడ టీవీ కూడా చూసే అవకాశం ఉంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే అక్కడ ధ్యానం, యోగా నేర్పిస్తారు. అక్కడ అవసరమైతే వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. నిరుద్యోగులు, ఉపాధి కోసం వచ్చినవాళ్లు ఉద్యోగం, ఏదైనా పని దొరికే వరకు ఇక్కడ ఉండొచ్చు.
ఇక్కడ ఇన్ని సౌకర్యాలు ఉన్నా, చాలా మందికి ఈ వసతి గృహాల గురించి తెలియదు. ప్రభుత్వం వీటి గురించి ప్రచారం చేస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుందని వాదన వినిపిస్తోంది. చాలామందికి ఈ విషయం తెలియక, ప్రచారం లేకపోవడంతో ఈ గృహాలకు ఆదరణ కరువైంది. ప్రభుత్వం వీటిపై దృష్టి పెడితే ఎంతోమందికి మేలు జరుగుతుంది అంటున్నారు.