Hot Posts

6/recent/ticker-posts

పాక్ సైనిక చర్యలతో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు - నెక్స్ట్ 48 గంటల్లో..!!


INDIA NEWS: ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం నేల మట్టం చేసింది. పాక్ తో పాటుగా పీఓకే లో ఉగ్రవాదుల స్థావరాలు.. శిక్షణా శిబిరాల పైన భారత వాయు సేన అర్ద్రరాత్రి క్షిపణులతో విరుచుకు పడింది. పెద్ద సంఖ్యల ఉగ్రవాదులను మట్టు బెట్టింది. దీంతో, సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత్ పైన ప్రతీకార చర్యలు ఉంటాయని పాక్ మంత్రులు చెబుతున్నారు. ఇటు భారత్ అప్రమత్తం అయింది. సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవటానికి భారత్ సిద్దంగా ఉంది.


ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అటు పాకిస్థాన్ సేన లు సరిహద్దుల్లో కాల్పులకు తెగ బడుతున్నాయి. భారత్ ఆర్మీ వీటిని ధీటుగా తిప్పి కొడుతోంది. పారా మిలిటరీ సిబ్బంది సెలవులను కేంద్రం రద్దు చేసింది. భారత్ లో పాకిస్థాన్ దాడులకు దిగే అవకాశం ఉందని విదేశాంగ అధికారులు వెల్లడించారు. దీంతో.. త్రివిధ దళాలు సమాయత్తం అయ్యాయి. ఏ పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే పూర్తి సంసిద్దత తరువాతనే భారత్ తాజాగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇక, కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ సహచర మంత్రులకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు.

కేబినెట్ భేటీ తరువాత ప్రధాని నేరుగా రాష్ట్రపతి వద్దకు వెళ్లారు. ఆపరేషన్ సింధూర్ తో పాటుగా సరిహద్దుల్లో నెలకొన్ని పరిస్థితులను వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న స్పందన గురించి రాష్ట్రపతికి నివేదించారు. ప్రధాని విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకి స్థాన్ సహా బంగ్లాదేశ్, నేపాల్ తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. డీజీపీలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. పాకిస్థాన్ నుంచి ఎటు వంటి ప్రతిస్పందన వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని చెబుతూనే.. రాష్ట్రాలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించనున్నారు.

ఈ సాయంత్రం దేశ వ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. గురువారం కేంద్రం అఖిలపక్ష సమావేశానికి నిర్ణయించింది. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనుంది. ఆర్మీ ఆకస్మిక దాడుల తరువాత చోటు చేసుకున్న పరిణామాలను వివరించనుంది. ఏ క్షణం అయినా ఎలాంటి ప్రతిఘటన పాక్ నుంచి వచ్చినా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్దంగా ఉన్నాయి. దీంతో, రానున్న 48 గంటలు ఉత్కంఠ పెంచే అవకాశం కనిపిస్తోంది.