Hot Posts

6/recent/ticker-posts

టీడీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత.. విజయవాడకు తరలింపు..


ANDRAPRADESH: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా.. అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎమ్మెల్యేను కుటుంబసభ్యులు విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. వర్ల కుమార్ రాజా రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఎండలో వివిధ గ్రామాల్లో పర్యటించారు. దీంతో మరోసారి అస్వస్థతకు లోనయ్యారు. 


కుటుంబసభ్యులు వెంటనే ఆయనను పామర్రులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ వర్ల కుమార్ రాజా.. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆయనకు వడ దెబ్బ తగిలిందని టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు.

మరోవైపు వర్ల కుమార్ రాజా ప్రస్తుతం విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఒక రోజు పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ సీనియర్ నేత అయిన వర్ల రామయ్య తనయుడే కుమార్ రాజా వర్ల. తండ్రి అడుగు జాడల్లోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుఫున కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ పై 29690 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

ఎన్నికల ముందు నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు వర్ల కుమార్ రాజా. శాసనసభ్యుడైన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పామర్రు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో కుమార్ రాజా వర్ల పాల్గొన్నారు. అయితే అప్పటికే జ్వరంతో నీరసంతో ఉన్న ఆయన.. ఎండలో తిరిగేటప్పటికి ఎండ దెబ్బ తగిలిందని కార్యకర్తలు చెప్తున్నారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now