ఏలూరు, పశ్చిమ వాహిని, మే 04: వేసవి కాలంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే కుటుంబాల భద్రత కోసం ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు భద్రతా సూచనలు అందజేశారు. పాంప్లెట్లు పంపిణీ చేస్తూ దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
వేసవి సెలవుల్లో చాలామంది కుటుంబాలు విహారయాత్రలు, శుభకార్యాలు లేదా సొంత గ్రామాలకు వెళ్లే సందర్భంలో ఇళ్లు ఖాళీగా ఉండటం వల్ల దొంగతనాల అవకాశాలు పెరుగుతాయని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో “Locked House Monitoring System” సేవలను వినియోగించుకోవాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే, ఇంటి వద్ద నిఘా ఏర్పాటు చేసి స్టేషన్ నుంచి పర్యవేక్షణ చేపడతామని తెలిపారు.
ప్రతి ఇంటి వద్ద, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నిరోధించవచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఇంటి యజమానులు ఊరికి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్ లేదా బీట్ కానిస్టేబుల్‌కు సమాచారం ఇవ్వడం ద్వారా రాత్రిపూట గస్తీ పెంచే అవకాశం ఉంటుందని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పొరుగువారికి తెలియజేయాలని కోరారు.
ఇంటి లోపల ఎక్కువ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని పోలీసులు సూచించారు. ప్రజల ఆస్తి రక్షణే పోలీసుల ముఖ్య కర్తవ్యం అని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరిస్తే నేరరహిత సమాజం సాధ్యమవుతుందని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేయాలని సూచించారు.


