ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ జీ. మునిరాజా చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మునిరాజా మాట్లాడుతూ, 1761 ఏప్రిల్ 27న జన్మించిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని రాజధానిగా చేసుకుని కృష్ణా, గుంటూరు ప్రాంతాలను పరిపాలించిన మహానీయుడు అని పేర్కొన్నారు. ధరణికోట సమీపంలో అమరావతి పట్టణాన్ని అభివృద్ధి చేసి రాజధానిని చింతపల్లి నుంచి అక్కడికి మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి పరిపాలనతో పాటు కవులు, పండితులకు ఆశ్రయం ఇచ్చిన దాతగా ఆయన పేరొందారని అన్నారు.
ఉప్పెనలు, విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేయడంతో పాటు పన్నులను మాఫీ చేసి ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడిగా ఆయన నిలిచారని తెలిపారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో 108 దేవాలయాలను నిర్మించి ధార్మిక సేవలు అందించిన విషయాన్ని వివరించారు. అమరేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించి అర్చకులకు భూములు కేటాయించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా తీర్థయాత్రలు చేసి అన్నదాన సత్రాలను ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని, ఆయన సేవలను భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా జరుపుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి సెక్షన్ సూపర్డెంట్ నాగేశ్వరరావు, ఆర్ఐ సతీష్, ఆర్ఎస్ఐ వెంకటేష్, భాస్కరరావు, సత్యనారాయణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


