విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గానికి జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భీమిలి అంటేనే.. పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్‌గా గుర్తింపు తెచ్చుకుంది
VISAKHAPATNAM:విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గానికి జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భీమిలి అంటేనే.. పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎవరు గెలిచినా.. ఇక్కడ రాజకీయ ఓ రేంజ్‌లో ఉంటుంది. గతంలో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. అయినా, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయినా.. దూకుడుకు మారుపేరు. అవంతితో పోల్చుకుంటే.. గంటా మరో రెండాకులు ఎక్కువే చదివారు.
దీంతో భీమిలి పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే నడుస్తుంది. అయితే.. గత ఏడాది కాలంలో మాత్రం ఇక్కడ సైలెంట్ రాజకీయాలు జరుగుతున్నాయి. అంతేకాదు.. అసలు ప్రతిపక్షమే లేని నియోజకవర్గాల్లో భీమిలి కూడా ఒకటిగా మారిపోయింది. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన అవంతి శ్రీనివాస్.. వైసీపీకి రాజీనామా చేశారు. అయితే.. తర్వాత ఆయన తిరిగి తన సొంత గూడైన టీడీపీలోకి చేరుతారని అందరు అనుకున్నారు. కానీ, కారణాలు ఏవైనా.. ఆయన మౌనంగా ఉండిపోయారు.
దీంతో బహిరంగంగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడి వేడి కామెంట్లు, సవాళ్లు వంటివి లేకుండా భీమిలి ప్రశాంతంగా ఉందనే వాదన బయట జోరుగానే వినిపిస్తోంది. కానీ.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే .. మరో కోణంలో మాత్రం సైలెంట్ వార్ నడుస్తోంది. టీడీపీలోకి తనను చేరకుండా అడ్డుకుంటున్నారని.. అవంతి వాపోతున్నారు. దీనికి ప్రస్తుత ఎమ్మెల్యే గంటానే కారణమని కూడా ఆయన అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. వారానికి ఒకసారి తన అనుచరులతో భేటీ అవుతున్న ఆయన.. వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు.
ఇక, గంటా శ్రీనివాసరావు.. ఈ విషయాన్ని మౌనంగా చూస్తున్నారు. ఆయన ఎక్కడా పెదవి విప్పడం లేదు. కనీసం.. అవంతి గురించి కూడా ఎక్కడా మాట్లాడడం లేదు. అయితే.. తెరచాటున మాత్రం అవంతిని అడ్డుకుంటున్నారన్నది రాజకీయంగా వినిపిస్తున్నమాట. ఇక, సంక్షేమ పథకాలపై ప్రచారం విషయాన్ని కూడా గంటా క్షేత్రస్థాయి నాయకులకు అప్పగించారు. తాను నేరుగా ప్రజల మధ్యకు వెళ్లడం లేదు. దీనికి కూడా సర్కారుపై ఆయనకు ఉన్న అసంతృప్తి కారణమని తెలుస్తోంది.
ప్రస్తుత మంత్రి వర్గంలో చోటు లేకపోవడంతో పాటు.. తనకు గతంలో ఉన్న ప్రాదాన్యం కూడా లేకుండా పోయిందన్న చర్చ అయితే.. తన వారి నుంచి వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా.. భీమిలిలో బహిరంగ రాజకీయాలు లేకపోయినా.. సైలెంట్ వార్ అయితే నడుస్తోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi