తాజా వార్తలు

10/recent/ticker-posts

ఉపాధి కూలీకి రూ.లక్ష సాయం ఇవ్వాలి: వ్యవసాయ కార్మిక సంఘం


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 9: వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ పనుల్లో ప్రమాదానికి గురైన మహిళా కూలీ బేతంపూడి సీతకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. టీ.నరసాపురం మండలంలోని బరంపాలెం పాలకుంట చెరువులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు విరిగిన సీతకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష సాయం ఇవ్వాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గూడల్లి వెంకట్రావు కోరారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల సమయంలో మట్టి తవ్విన గోతిలో పడిపోవడంతో బేతంపూడి సీత తొడ భాగంలో తీవ్ర గాయాలు కావడంతో పాటు ఎముక రెండు చోట్ల విరిగిందన్నారు. గత రెండు వారాలుగా జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని విమర్శించారు.

ఉపాధి హామీ పనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు సహాయం అందించాల్సి ఉన్నప్పటికీ, ఈ విషయంలో ఏపీవో, ఎంపీడీవో వంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి కుటుంబ సభ్యులే అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారని తెలిపారు.

ప్రమాదానికి గురైన సీత పూర్తిగా కోలుకుని తిరిగి పని చేయగల స్థితికి వచ్చే వరకు ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం వి-గ్రాంజీ (వేతన భృతి) అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వైద్య ఖర్చుల కోసం వెంటనే ప్రత్యేక నిధుల నుంచి ఆర్థిక సాయం మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.