ఏలూరు, పశ్చిమ వాహిని, మే 04: యువత దేశ భద్రతకు కీలక పాత్ర పోషిస్తారని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ సూచనల మేరకు ఏలూరు నగరంలోని సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాలలో భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 650 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. క్యాంప్ కమాండెంట్ కల్నల్ అమిస్ పాండా, పోలీసు అధికారులు, క్యాంప్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్” ప్రాధాన్యతను మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మరియు శక్తి టీమ్స్ వివరించారు. అత్యవసర సమయంలో ఒక్క బటన్ నొక్కితే పోలీసు సహాయం ఎలా అందుతుందో ప్రాక్టికల్‌గా చూపించి ప్రతి విద్యార్థిని తమ మొబైల్‌లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. అలాగే రహదారి ప్రమాదాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “PM రాహత్” పథకం గురించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వివరించారు. హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటన ప్రాణ రక్షణకు ఎంత ముఖ్యమో వివరించారు.
సైబర్ నేరాలపై కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. తెలియని లింక్‌లు క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పంచుకోవడంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు. కొత్త చట్టాల ద్వారా మహిళలకు లభించే న్యాయ పరమైన రక్షణల గురించి వివరించి, చట్టంపై అవగాహన ఉంటే నేరాలను అడ్డుకోవచ్చని చెప్పారు.
సోషల్ మీడియాను విజ్ఞాన సాధనంగా ఉపయోగించుకోవాలని, ఫేక్ న్యూస్ వ్యాప్తి లేదా ఇతరులను అవమానించే పోస్టులు పెట్టడం వల్ల చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు క్రమశిక్షణతో ఉంటూ సమాజంలో మార్పుకు దారితీయాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ కుటుంబాలు, గ్రామాల్లో పంచుకోవాలని డీఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు, డీటీఆర్‌బీ మరియు శక్తి టీమ్స్, ఎన్‌సీసీ విభాగం అధికారులు పాల్గొన్నారు.


