Hot Posts

6/recent/ticker-posts

ఆంధ్రప్రదేశ్‌ డేటా మొత్తం నానక్‌రామ్‌గూడలో..: పవన్‌ కల్యాణ్‌.


తాడేపల్లిగూడెం: సీఎం జగన్‌ సతీమణిని ఎప్పుడూ వివాదాల్లోకి లాగలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. పవన్‌ కల్యాణ్ చేపట్టిన రెండో విడత వారాహి యాత్ర తాడేపల్లిగూడెం చేరుకుంది.


ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ''ప్రమాణస్వీకారం రోజు జగన్‌ నన్ను ఆహ్వానించారు. ప్రత్యర్థులుగా ఉన్నందున రాలేనని ఆరోజు చెప్పా. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటానని చెప్పా. జగన్‌ను వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ విమర్శించలేదు. మేం ఎప్పుడూ సీఎం జగన్‌ సతీమణిని వివాదాల్లోకి లాగలేదు. కానీ, జగన్‌ నీకు సంస్కారం లేదు. సీఎంగా ఉండే అర్హత లేదు. వాలంటీరు అంటే జీతం ఆశించకుండా పనిచేసే వ్యక్తి. వాలంటీర్ల కేంద్రం హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ డేటా మొత్తం నానక్‌రామ్‌గూడలోనే ఉంది. నానక్‌రామ్‌గూడలోని ఓ ఏజెన్సీకి ఏపీ ప్రజల సమాచారం ఎందుకు ఇచ్చారో జగన్‌ సమాధానం చెప్పాలి. అందులో పనిచేస్తున్న 700 మందికి ఎవరు జీతాలు ఇస్తున్నారు? వాలంటీర్లపై నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. వ్యవస్థ పనితీరు గురించే మాట్లాడుతున్నా. ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో కొందరు వాలంటీర్లు పట్టుబడ్డారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని భయపెడుతున్నారు..


వాలంటీరు వ్యవస్థకు అధిపతి ఎవరు?

రెడ్‌ క్రాస్‌కు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ హెడ్‌గా ఉంటారు. జగన్‌.. నీ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి? వాలంటీర్లు అనేక చోట్ల ప్రజలను వేధిస్తున్నారు. తిరుపతిలో ఎర్రచందనం రవాణాలో వాలంటీర్లు పట్టుబడ్డారు. నేరం చేసిన వాలంటీర్లకు భయం లేదు. మా జగనన్న నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చేశాడు. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో ఉన్నారు. జనవాణి ప్రారంభించేందుకు వాలంటీర్లే కారణం. వాలంటీరు వేతనం రోజుకు రూ.164.38 అంటే ఉపాధి హామీ కూలీ వేతనం కంటే తక్కువే. వాలంటీరు జీతం భూమ్‌ భూమ్‌కి తక్కువ.. ఆంధ్రా గోల్డ్‌కి ఎక్కువ. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఇప్పటి వరకు రూ.1.35లక్షల కోట్ల మద్యం అమ్మారు. ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతే జగన్‌ ముఖంలో నవ్వు వస్తుంది. ఆడబిడ్డల మానప్రాణాల సంరక్షణే జనసేన విధానం.మహిళలు కోరుకున్న చోట మద్య నిషేధం అమలు చేస్తాం. మద్యం వల్ల మహిళలకు ఇబ్బంది ఉండదని హామీ ఇస్తున్నా'' అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.