ANDHRAPRADESH:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా రెండుసార్లు పనిచేసి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, పాలనను గుర్తుచేసుకుంటూ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఇవాళ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
వైఎస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్, కుమార్తె, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పులివెందులలోని ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం తల్లితో కలిసి వైఎస్ షర్మిల ఎప్పటి లాగే తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఇందులో పలువురు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ఆర్ రెండుసార్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన సేవల్ని షర్మిల గుర్తుచేసుకున్నారు. అనంతరం షర్మిల, విజయమ్మ కలిసి ప్రత్యేకంగా వైఎస్ జయంతి సందర్భంగా కేక్ కూడా కట్ చేశారు.
అనంతరం వైఎస్ జగన్ కూడా తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయకు వెళ్లి బంధువులతో కలిసి నివాళులు అర్పించారు. తర్వాత నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైయస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు భారీగా అభిమానులు వైఎస్సార్ ఘాట్ వద్దకు పోటెత్తారు. దీంతో జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi