తాజా వార్తలు

10/recent/ticker-posts

కార్మికులకు భద్రత–భరోసా కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బండారు


రావులపాలెం, పశ్చిమ వాహిని, మే 01: కార్మికుల రక్షణ, శ్రేయస్సు కోసం నినదించిన రోజే మే డే అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మే డే సందర్భంగా రావులపాలెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి కూడా హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తెరిగి శ్రేయస్సు కోసం కృషి చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికుల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుని వారికి అండగా నిలబడటం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటోందన్నారు. ఆకలి రహిత సమాజం కోసం అన్నా క్యాంటీన్లు, సామాజిక భద్రతా పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో సుమారు 88 లక్షల అసంఘటిత కార్మికులు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమం కోసం రూ.615 కోట్లతో పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో కార్మిక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం మళ్లీ వాటిని పునరుద్ధరించి అమలు చేస్తున్నామని తెలిపారు.

కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమల స్థాపన వంటి కార్యక్రమాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే రావులపాలెంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్మికుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు.

కార్మిక దినోత్సవ వేడుకల్లో కార్మికులతో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకంపై కార్మికులు అవగాహన పెంపొందించుకుని వాటిలో నమోదు చేసుకోవాలని సూచించారు.