పెదపాడు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: పెదపాడు శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం మొదటి రోజు కార్యక్రమం ఆసక్తికరంగా ప్రారంభమైంది. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేల్పుల ప్రభాకర్, ఎం. వేణుగోపాల్, ఎం. సురేష్ మాస్టార్లు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలంటూ, ప్రతి విద్యార్థి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో గ్రంథాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని మంచి విజ్ఞానం సంపాదించుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా పిల్లలతో క్యారమ్స్ ఆటలు నిర్వహించారు. అలాగే కథలు చెప్పడం, కథలు చదివించడం వంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో ఆసక్తి పెంచారు.
ఈ శిబిరంలో రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, సుమారు 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో జరిగింది.
చివరిగా పాల్గొన్న విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


