తాజా వార్తలు

10/recent/ticker-posts

నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, మే 01: జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం లో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన ఈ రోజున ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చి భక్తులను ఆకట్టుకున్నారు.


ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు నిర్వహించగా, మూలవిరాట్టుకు ఏకాదశ సాయంసంధ్యా హారతి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు.

ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు మాట్లాడుతూ అమ్మవారి అలంకరణ, ప్రసాద వితరణకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా పిన్నమనేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు రూ.5,116 విరాళం సమర్పించగా, పాలడుగుల శ్రీను–జ్యోతి దంపతులు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే నౌడు ఆనంద్–వెంకటలక్ష్మి దంపతులు మజ్జిగ పంపిణీకి పెరుగు అందించారు. అమ్మవారి వెండి చీర తయారీ కోసం భక్తులు వెండి రూపంలో, ధన రూపంలో సహకరించాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది.

శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా బృందం, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.