పోలవరం, పశ్చిమ వాహిని, మే 01: పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో బర్రింకలపాడు లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారికి మరింత ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జీలుగుమిల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుంచి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని డి. హఫీజాను, అంకన్నగూడెం టి.డబ్ల్యూ.ఏ గర్ల్స్ హై స్కూల్ నుంచి ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థిని, అలాగే జీలుగుమిల్లి జడ్పీహెచ్ఎస్ నుంచి తృతీయ స్థానం సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. వారి కృషి, పట్టుదలను కొనియాడుతూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి విజయాలకు దారి చూపిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సాలువాలతో సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.50,000 నగదు బహుమతులు అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అపార ప్రతిభ ఉన్న విద్యార్థులకు సరైన మార్గదర్శనం అందిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, జనసేన పోలవరం మండల అధ్యక్షులు గునపర్తి చిన్ని, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, కూటమి నాయకులు పూనెం ఆదిత్య, మన్నిడి సాయిబాబా, తమ్మన సాంబశివరావు, బుడిపుట్టి చిరంజీవి, గంగిరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు పీ. చంద్రావతి, ఉపాధ్యాయులు పి. నాగేశ్వరరావు, జీవీకే ప్రసాద్, బి. పున్నమ్మ తదితరులు పాల్గొన్నారు.


