టీ.నరసాపురం, పశ్చిమ వాహిని, మే 01: పోలవరం నియోజకవర్గం టీ. నరసాపురం మండలం పరిధిలో జనసేన యూత్ లీడర్, సామాజిక కార్యకర్త పింగుల మధు జన్మదిన వేడుకలు ఉపాధి శ్రామికుల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు సేవా కార్యక్రమంగా మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేశారు. సుమారు 100 మందికి పైగా వేతనదారులు ఈ కార్యక్రమంలో లబ్ధి పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం నియోజకవర్గ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ జట్ల సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కష్టజీవుల చెమట చుక్కే దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఐక్యతే గొప్ప ఆయుధమని ఆయన అన్నారు.
ఉపాధి హామీ కూలీలకు పని సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ నాగేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్, సిహెచ్ నవీన్, తోట సత్యనారాయణ, సామాజిక కార్యకర్తలు ఎస్.డి. నాసరపాషా, కొరివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ వేతనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నాయకులు ఆకాంక్షించారు.


