ఏలూరు, పశ్చిమ వాహిని, మే 04: లక్ష్యం స్పష్టంగా ఉండి పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పదని పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ యువతకు దిశానిర్దేశం చేశారు. పినకడిమి గ్రామంలో యువత భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కష్టాలను జయించే సంకల్పం ఉంటే పేదరికం కూడా అడ్డుకాదు అని తెలిపారు.
ఈ సందర్భంగా తన విద్యార్థి దశలో చూసిన ఒక సంఘటనను ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వివరించారు. ఫీజులు చెల్లించడానికి డబ్బులు లేకపోయినా, రక్తాన్ని అమ్మి చదువు కొనసాగించిన ఒక వ్యక్తి నేడు ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఆ వ్యక్తి పట్టుదల తనకు ఎప్పటికీ ప్రేరణగా నిలిచిందని, అదే స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. చదువుపై దృష్టి పెట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
యువత తమ సమయాన్ని వృథా చేయకుండా లక్ష్య సాధన కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. క్రమశిక్షణతో కష్టపడి చదివితేనే జీవితంలో స్థిరమైన విజయాలు సాధించవచ్చని అన్నారు. అలాగే సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, క్షణికావేశంలో చేసే పొరపాట్లు జీవితాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
చట్టాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నేరాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. కష్టాలను చూసి వెనకడుగు వేయకుండా అంకితభావంతో చదివి కుటుంబం, గ్రామానికి గౌరవం తీసుకురావాలని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ యువతలో నూతనోత్సాహాన్ని నింపారు.


