ఏలూరు, పశ్చిమ వాహిని, మే 04: భూ రికార్డుల స్వచ్చీకరణ మరియు రీ-సర్వే అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం దెందులూరు మండలం గోపన్నపాలెంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి రైతులకు ఈ పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఈ-కేవైసీ పూర్తి చేసిన తరువాతే పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు అధికారులు వివరించారు.
కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, పాస్ పుస్తకాలలో రైతు పేరు, భూవిస్తీర్ణం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి కీలక వివరాలు ఖచ్చితంగా నమోదు చేసినట్లు తెలిపారు. రైతులు పాస్ పుస్తకాలు స్వీకరించే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా పొరపాట్లు లేదా వ్యత్యాసాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సరిచేసిన తరువాతే పాస్ పుస్తకాన్ని తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
భూవివరాలలో జాయింట్ హక్కులు (Joint Pattadar), భూవిస్తీర్ణంలో మార్పులు లేదా మ్యుటేషన్ సంబంధిత వివరాలు సక్రమంగా నమోదు చేయబడినట్లు నిర్ధారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. గ్రామస్థాయిలో వీఆర్ఏలు, సర్వే అధికారులు ముందస్తుగా షెడ్యూల్ ప్రకారం రైతులకు సమాచారం అందిస్తూ ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, పట్టాదార్ పాస్ పుస్తకాలలో ఖచ్చితత్వం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రాజముద్రతో ముద్రించిన ఈ పుస్తకాలు రైతులకు భూ హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మ్యుటేషన్ దరఖాస్తులు, భూ మార్పులు వంటి అంశాలను పరిశీలించి నిబంధనల మేరకు కొత్త పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి, తహసీల్దార్ సుమతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గారపాటి రామసీత తదితరులు పాల్గొన్నారు.


