తాజా వార్తలు

10/recent/ticker-posts

పీజీఆర్‌ఎస్ అర్జీలపై కఠిన చర్యలు – గడువులోగా పరిష్కారం తప్పనిసరి: కలెక్టర్


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 04: జిల్లాలో పీజీఆర్‌ఎస్ (PGRS) మరియు రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 241 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.


కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వారికి సంతృప్తి కలిగే విధంగా నాణ్యమైన సేవలు అందించాలని అన్నారు. సమస్య పరిష్కారం సాధ్యం కాకపోతే, కారణాలను స్పష్టంగా వివరించే విధంగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదని కలెక్టర్ హెచ్చరించారు. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా, సమర్థంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా అందిన అర్జీలలో భూ ఆక్రమణలు, డ్రైనేజీ సమస్యలు, పంటపొలాల వద్ద చెత్త పారవేత, నకిలీ పత్రాల ద్వారా భూ కబ్జాలు, అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలింపు వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయని వెల్లడైంది. అలాగే గృహ నిర్మాణానికి బ్యాంకు రుణం మంజూరు చేయాలని కోరిన వినతులు కూడా వచ్చాయి.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. యం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్. దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.