ఏలూరు, పశ్చిమ వాహిని, మే 04: ఏలూరు జిల్లాలో కోకో పంట అభివృద్ధి మరియు అధిక దిగుబడి సాధన కోసం ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPCRI) శాస్త్రవేత్తలు జిల్లాలోని పలు కోకో నర్సరీలు, తోటలను సోమవారం సందర్శించి పరిశీలించారు.
మొదటగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామానికి చెందిన రైతు శ్రీ రామాంజనేయ రెడ్డి నర్సరీని శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వహణలో అనుసరించవలసిన శాస్త్రీయ పద్ధతులు, ముఖ్యంగా అధిక దిగుబడి ఇచ్చే తల్లి మొక్కల (Mother Plants) ఎంపిక, వాటి నుండి నాణ్యమైన మొక్కల తయారీ సాంకేతికతలపై రైతులకు అవగాహన కల్పించారు. కత్తిరంపుల (Cuttings) ద్వారా మొక్కల పెంపకం విధానాన్ని ప్రదర్శనాత్మకంగా చూపించి రైతులకు ప్రాయోగిక జ్ఞానం అందించారు.
తదుపరి, CPCRI ద్వారా పంపిణీ చేసిన పాలీ క్లోనల్ గార్డెన్స్‌ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. కామవరపుకోట మండలం గూడూరి శ్రీదేవి కోకో తోట, పెదవేగి మండలంలో పులగం సుబ్బారెడ్డి, జాస్తి రాజన్ బాబు తోటలు, నూజివీడు ప్రాంతానికి చెందిన జగ్గవరపు వీర రాఘవ రెడ్డి, ముసునూరు మండలం మొరవనేని వెంకట సీత రత్న కుమారి తోటలను సందర్శించారు. ఈ సందర్శనల ద్వారా తల్లి మొక్కల ఎంపిక, అంట్లు కట్టే విధానం, నర్సరీల్లో నాణ్యమైన మొక్కల తయారీపై నూతన పద్ధతులను వివరించారు.
ఈ కార్యక్రమంలో CPCRI మాజీ డైరెక్టర్ డా. పి. చౌడప్ప, శాస్త్రవేత్తలు డా. ఎలైన్ అప్సర, డా. అశోక్, డా. సుశీల, APMIP ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎస్. రామమోహన్, జిల్లా ఉద్యాన అధికారి కె. షాజా నాయక్, సహాయ ఉద్యాన సంచాలకులు కె. సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఈ కార్యక్రమం ద్వారా ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకుని కోకో పంటలో మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు తెలిపారు.


