ఏలూరు, పశ్చిమ వాహిని, మే 04: ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి ప్రమాదాల నివారణ మరియు అక్రమ రవాణా నియంత్రణ కోసం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో మే 3, 4 తేదీల్లో పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టి వాహనదారుల భద్రతపై దృష్టి సారించారు.
ఈ సందర్భంగా నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు “ఫేస్ వాష్” కార్యక్రమం నిర్వహించారు. అలసటతో డ్రైవింగ్ చేసే వాహనదారులు తక్షణం విశ్రాంతి తీసుకోవాలని, అవసరమైతే ప్రయాణాన్ని నిలిపివేయాలని సూచించారు. వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై వివరించి జాగ్రత్తలు పాటించేలా ప్రోత్సహించారు.
పోలీసులు ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు కూడా ఇచ్చారు. నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయకూడదని, అధిక వేగం ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపడం చట్టవిరుద్ధమే కాక ప్రాణహానికరమని తెలిపారు. రాత్రివేళల్లో లైట్లను సరిగ్గా వినియోగించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తి రక్షణకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉందని, ప్రతి ఒక్కరు రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ తెలిపారు.


