ఏలూరు, పశ్చిమ వాహిని, మే 01: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ల పంపిణీ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. మొదటి రోజే భారీ స్థాయిలో పంపిణీ పూర్తి కావడం గమనార్హం.
భీమడోలు మండలంలోని కూరేళ్లగూడెం సచివాలయంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని DRDA ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి టి.వి. విజయలక్ష్మి పర్యవేక్షించారు. సచివాలయ సిబ్బంది సమన్వయంతో లబ్ధిదారులకు సమయానికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా పారదర్శకంగా, ఎటువంటి అంతరాయం లేకుండా పంపిణీ కొనసాగింది.
ఈ నెలలో మొత్తం 2,56,340 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, మే 1 సాయంత్రం 6 గంటల నాటికి 2,36,477 మందికి పెన్షన్లు అందజేశారు. దీంతో మొదటి రోజే 92.25 శాతం పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో 4,996 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి అవ్వా, తాతలకు పెన్షన్లు అందజేశారు.
ఇంకా పెన్షన్ అందుకోని లబ్ధిదారులకు, అలాగే ఆరోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మానవతా దృక్పథంతో పెన్షన్లు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెన్షన్ పొందని ప్రతి లబ్ధిదారునికి సిబ్బంది స్వయంగా ఫోన్ చేసి, మే 2 సాయంత్రం లోగా 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.


