ఏలూరు/ఉంగుటూరు, పశ్చిమ వాహిని, మే 1: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఏ రైతుకైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ సూచించారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 18004256453 లేదా హెల్ప్ డెస్క్ నెంబర్ 7702003584 కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేస్తే తక్షణమే పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం ఉంగుటూరు మండలంలోని నారాయణపురం, చేబ్రోలు, తల్లాపురం గ్రామాల్లో ధాన్యం ఆరబెట్టే ప్రదేశాలను సందర్శించిన జేసీ, అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. రైతులకు సరిపడా 58 లక్షల గొనె సంచులు రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కూడా సిద్ధంగా ఉంచామని, రైతులు వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
ఉంగుటూరు మండలంలో మాత్రమే 53,485 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, నారాయణపురం సహా రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా 3,745 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. మండలంలో 157 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసి, సుమారు 16,93,747 గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదేవిధంగా ధాన్యాన్ని భద్రపరచేందుకు 325 టార్పాలిన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రైతులు స్వయంగా హమాలీలు, వాహనాలు, గోనె సంచులు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నిబంధనల ప్రకారం చెల్లింపులు చేస్తుందని జేసీ తెలిపారు. గోనె సంచుల వినియోగానికి ఒక్కో సంచుకు రూ.4.47, హమాలీలకు క్వింటాల్‌కు రూ.24.06 చొప్పున చెల్లిస్తామని చెప్పారు. అలాగే వాహనాల ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు.
రైతులు తమకు అనుకూలమైన మిల్లులకు ధాన్యం పంపించుకునే స్వేచ్ఛ ఉందని జేసీ స్పష్టం చేశారు. అనంతరం కైకరం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి, రైతులకు అందుతున్న సేవలపై సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి. శివరామమూర్తి, జిల్లా సహకార శాఖాధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, తహసీల్దార్ పూర్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


