ఏలూరు, పశ్చిమ వాహిని, మే 01: స్థానిక సర్ సి.ఆర్. రెడ్డి అటానమస్ కళాశాలలో “ఎచీవర్స్ డే 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. చక్రధరరావు అధ్యక్షత వహించారు. విద్యార్థులను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని, చదువు పూర్తయ్యే సరికి ఉద్యోగ అవకాశాలు పొందేలా నైపుణ్యాలను అందిస్తున్నామని ఆయన తెలిపారు.
2025–26 విద్యాసంవత్సరంలో కళాశాలలో 49 కంపెనీల ద్వారా ప్రాంగణ నియామకాలు నిర్వహించగా, 416 మంది విద్యార్థులకు మొత్తం 1581 నియామక పత్రాలు లభించాయి. ఒక్కో విద్యార్థి రెండు నుంచి మూడు కంపెనీలలో ఎంపిక కావడం విశేషమని పేర్కొన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించేందుకు “ఎచీవర్స్ డే”ను నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఆర్‌ఆర్ విద్యాసంస్థల అధ్యక్షులు డా. అల్లూరి ఇంద్రకుమార్ మాట్లాడుతూ, ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ సర్ కట్టమంచి రామలింగారెడ్డి పేరుతో ఈ కళాశాల స్థాపన చారిత్రాత్మకమని చెప్పారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా 2005లో ప్లేస్‌మెంట్ సెల్, స్కిల్ డెవలప్‌మెంట్ సెల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
సంస్థల కార్యదర్శి డా. ఎం.బి.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, తాను కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థినేనని, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటు ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. “ఎచీవర్స్ డే” కార్యక్రమమే ఈ విద్యాసంస్థ విజయానికి నిదర్శనమని తెలిపారు.
పాలకవర్గ జాయింట్ సెక్రటరీ వంకినేని భానుప్రకాష్ మాట్లాడుతూ, ఉద్యోగాలు పొందిన విద్యార్థులు తమ పనితీరుతో సంస్థలకు పేరు తీసుకురావాలని సూచించారు. పోటీ ప్రపంచంలో రాణించేందుకు కళాశాలలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ వి. శ్రీకృష్ణ, కోశాధికారి బి.బి.వి.వి. ప్రసాదరావు, వివిధ కళాశాలల కరస్పాండెంట్లు డా. కె.ఎస్. విష్ణుమోహన్, కలగర శివరామకృష్ణ ప్రసాద్, కల్కి సత్యనారాయణ, వంకినేని రఘుకుమార్, సీఈఓ డా. కిషన్ కాజా, విఠల్, వైస్ ప్రిన్సిపాల్స్ కె. విశ్వేశ్వరరావు, ఎం. రత్నాకర్, పీజీ కోర్సుల డైరెక్టర్ డా. వి.ఆర్.ఎస్. బాబు యలమర్తి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


