విజయవాడ, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యపై ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తూ IFWJ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామకృష్ణ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హత్యకు సంబంధించిన ఎవరైనా ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, కోర్టులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయన్నారు.
మృతుడి కుటుంబానికి IFWJ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందించాలని కోరారు. కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులను సహించబోమని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


