తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య.. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం


చిత్తూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: చిత్తూరు జిల్లా వి.కోటలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణంగా హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రౌడీషీటర్ తమీమ్ ప్రధాన నిందితుడిగా గుర్తించబడినట్లు వెల్లడించారు. అతనికి మరో వ్యక్తి సహకరించినట్లు అనుమానిస్తున్నారు. తమీమ్ ప్రస్తుతం కర్ణాటకలో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.

జర్నలిస్టు హత్యపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున తిరుపతి జిల్లా సభ్యుడు అరవ గోపాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దారుణాలు సిగ్గుచేటని, సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా నాయకులు చెంగల్రాయులు (గాంధీ), వళిగళం గోపి ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్య వెనుక ఉన్న కుట్రను పూర్తిగా బయటపెట్టాలని పోలీసులను కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.