తాజా వార్తలు

10/recent/ticker-posts

ఇంధనంపై అపోహలు నమ్మొద్దు.. పారదర్శక సరఫరా కొనసాగుతుంది: ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


పోలవరం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: పెట్రోల్, డీజిల్ కొరతపై వ్యాపిస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలని, కృత్రిమ కొరతపై భయాందోళనలు అవసరం లేదని తెలిపారు.


మంగళవారం జీలుగుమిల్లిలోని పెట్రోల్ బంకును ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా ఇంధనం పొందాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు వాహనదారులకు నేరుగా పంపుల ద్వారా ఇంధనం నింపించి అవగాహన కల్పించారు.

అత్యవసర సేవలకు—అంబులెన్స్‌లు, వైద్య సేవలు, ప్రభుత్వ వాహనాలు, ప్రజా రవాణా వాహనాలకు—ఇంధనం నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే బంకుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, స్టాక్ వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని సూచించారు.

తప్పుడు ప్రచారాలను నమ్మి అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలమని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల అవసరాల కోసం అప్రమత్తంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకటేశ్వరరావు, ఎంపీడీవో వెంకటలక్ష్మి, డిటి పెద్దిరాజు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.