ఏలూరు/బుట్టాయిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పోషణ్ వాటిక కార్యక్రమం మెరుగైన ఫలితాలను అందిస్తున్నదని ఏపీ ఔషధ మొక్కలు, సుగంధద్రవ్యాల బోర్డు (ఏపీఎంఏపీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆవుల చంద్రశేఖర్ తెలిపారు.
మంగళవారం బుట్టాయిగూడెంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇళ్ల వద్ద సేంద్రియ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచే చిన్న తోటలు ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
పాఠశాల ప్రాంగణంలో పోషకాహార, ఔషధ మొక్కల పెంపకానికి రూ.7 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర అభివృద్ధి అందిస్తున్న ఈ విద్యాసంస్థను ఆయన ప్రశంసించారు.
2020లో ప్రారంభమైన ఈ పాఠశాల సీబీఎస్ఈ గుర్తింపుతో 6 నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తోందని, 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 480 మంది విద్యార్థులకు వసతి, విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
పోషణ్ వాటిక ద్వారా రసాయన రహిత ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉండటంతో పాటు, మహిళలు, పిల్లల్లో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువులతో తక్కువ ఖర్చుతో సాగు చేయడం ద్వారా స్థానిక సమాజాలు స్వయం సమృద్ధి సాధించవచ్చని చెప్పారు.
అలాగే తులసి, అలొవెరా వంటి ఔషధ మొక్కల పెంపకం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఈ కార్యక్రమం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత పెంపొందించడంలో కీలకంగా నిలుస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎంఏపీ ఉప సిఇవో ప్రదీప్, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ మిశ్రా, సహాయ కార్యదర్శి రఘునాథ్, కన్సల్టెంట్ ఎస్. రంగారావు, ఎన్‌ఈఎస్‌టీఎస్ కన్సల్టెంట్ జి. కృష్ణారావు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



