తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం – రైతుల అభివృద్ధికి కొత్త దిశ: జెడి హబీబ్ భాషా


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 21: ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు రైతుల ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ చూపవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ యస్.కె. హబీబ్ భాషా పేర్కొన్నారు.


మంగళవారం స్థానిక ఐఏడీపీ హాల్లో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జీలుగుమిల్లి, కోయ్యలగూడెం, పోలవరం, దెందులూరు మండలాల నుండి సుమారు 120 మంది కేడరు సభ్యులు పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మరియు సమాచారానికి **elururythusampada.in** పోర్టల్ ఉపయోగకరమని, ఈ వేదిక ద్వారా సులభంగా బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ పోర్టల్ పై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.

జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ మాట్లాడుతూ, బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా కషాయాలు తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం వల్ల ప్రకృతి వ్యవసాయం సులభతరం అవుతుందని తెలిపారు. రైతులకు అవసరమైన ఇన్‌పుట్లు సమయానికి అందించడం కీలకమని చెప్పారు.

అదేవిధంగా ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) విధానంలో నవధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ, ప్రతి రైతుకు విత్తన కిట్లు అందించాలని సూచించారు. కలుషిత ఆహారం వల్ల పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు నేరుగా రైతుల నుండి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేడరు సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.