తాజా వార్తలు

10/recent/ticker-posts

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు భారీ జరిమానాలు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ చర్యలు అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


ఏలూరు పట్టణంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ మరియు రవాణా వాహనాల రాకపోకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిషేధిత సమయాల్లో నగరంలోకి ప్రవేశించే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ₹1000, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ₹5000, ట్రిపుల్ రైడింగ్‌కు ₹1000, ప్రమాదకర డ్రైవింగ్‌కు మొదటి సారి ₹1500, రెండోసారి ₹10,000 వరకు జరిమానా విధిస్తామని వివరించారు. అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ వంటి ఉల్లంఘనలపై కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.

మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మోటార్ సైకిళ్ల సైలెన్సర్లను మార్చి అధిక శబ్ద కాలుష్యం కలిగించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, అవసరమైన పత్రాలు వెంట ఉంచుకోవడం వంటి భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. ఈ నిబంధనలు ప్రజల భద్రత కోసం తీసుకున్నవేనని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు తెలిపారు.